ఓ సీత కథ

Posted by నవజీవన్

అనగనగా ఓ సీత. అందమైన ఓ దీవిలో తాతయ్య, నానమ్మలతో ఆనందంగా గడుపుతున్న చిన్నారి సీత జీవితంలో అనుకోకుండా ఒక రోజు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది  .. నానమ్మకు జబ్బు చేస్తే తాతయ్య ఆమెను వైద్యుడికి చూపించడానికి పట్నం ప్రయాణమవుతూ, ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి , మూడు మేకలను, ఒక చిట్టి పడవను ఆమె దగ్గర విడిచిపెడతాడు. తాతయ్య, నానమ్మతో పట్నానికి ప్రయాణమైన సమయానికే పెద్ద గాలీ, వానతో జోరుగా వర్షం పడుతుంది.  ఏదో కీడును శంకిస్తాడు ఆ వృద్దుడు.. ఒక్క క్షణం ఆలోచించి, వారు వెళ్ళిన తరువాత, మరీ పెద్ద వర్షం వస్తే ఇంటి పక్కనున్న బోధి వృక్షాన్ని ఎక్కేయమంటాడు. సీత అలాగే అంటుంది. తాతయ్య, నానమ్మతో పట్నం వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి నిజంగానే తాతయ్య ఊహించినట్లు పెద్ద గాలి వాన వస్తుంది. పల్లె మొత్తం కొట్టుకుపోతున్న సమయంలో ఏమి చేయాలో చిన్నారి సీతకు తోచదు. అప్పుడు, తాతయ్య బోధి వృక్షం ఎక్కేయమన్న సంగతి గుర్తుకొస్తుంది.ఏమీ ఆలోచించకుండా ఎక్కేస్తుంది.   కాని ఆమె చెట్టు ఎక్కేసాక తను ఎంతో ప్రేమించే బొమ్మ మోతీని ఇంట్లొనే మర్చిపోయిన విషయం ఆమెకు గుర్తుకొస్తుంది. ఆ బొమ్మను తెచ్చుకోవడానికి మళ్ళీ కిందకు దిగుతుంది..కాని వరద ప్రవాహం ఆమెను ముంచెత్తేస్తుంది. వరద ప్రవాహంలో కొట్టుకుపొతున్న ఆమెను కిషన్ అనే పదేళ్ళ కుర్రాడు కాపాడతాడు..సీత వాళ్ళ ఇంటి వద్ద ఉన్న చిట్టి పడవ సహాయంతో వారు ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకుంటారు. కిషన్ సీతకు ఎన్నో కబుర్లు చెబుతాడు. ఆ కబుర్లలో పడి సీత మోతీ విషయం మర్చిపోతుంది.

కిషన్ సీతకు తన దగ్గర దాచుకున్న మామిడిపళ్ళను ఇస్తాడు. సీతకు వాటి రుచి కొత్తగా ఉంటుంది. ఎందుకంటే, తను మొదటి సారి వాటిని తింటుంది కాబట్టి. తెల్లారాక, వరద ప్రవాహం తగ్గిపోతుంది. అయినా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటాయి. కిషన్ పడవలో సీతను వాళ్ళ ఇంటి వద్ద దిగబెడతాడు.

ఇంటి దగ్గర తాతయ్య సీత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతని కళ్ళలో కన్నీటిని గమనిస్తుంది సీత. ఏమైందని దీనంగా అడుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో నానమ్మ చనిపొయిందని చెబుతాడు తాతయ్య.

నానమ్మ మృతదేహాన్ని ఖననం చేసాక, వరదల్లో  నేలమట్టమైన ఇంటిని బాగుచేసే పనిలో పడతాడు తాతయ్య. సీత తాను కూడా తాతయ్య పనికి  సహాయం చేస్తుంది.తాతా మనవరాళ్ళిద్దరూ అలా జీవనం సాగిస్తూ గడిపేస్తారు.

అయితే సీతకు మిగిలిన లోటు ఒక్కటే..

మళ్ళీ తను జీవితంలో కిషన్ ను ఎప్పుడూ చూడలేకపోయింది..

చూడగానే, ఇది చాలా సాదా సీదా కథలా ఉండొచ్చు..కాని ఇందులొ 24 గంటల్లో ఒక చిన్నారికి ఈ లోకమంతా  ఏ విధంగా కనిపించిందో ఒక్క సారి విశ్లేషిస్తే, అందులో ఎన్నో అర్థాలు కనిపిస్తాయి. ఆర్ద్రత, స్నేహం, దుఖఃం అన్నీ ఒకే చోట ఒక్క చిన్నారి  పాత్రలో చూపించడానికి రచయిత ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది కదూ!

(ప్రసిద్ధ పిల్లల రచయిత రస్కిన్ బాండ్ రాసిన "ది యాంగ్రి రెయిన్-ఆంగ్ల కథకి స్వేచ్చానువాదం ఇది)





2 comments:

  1. Karthik said...

    Navajeevan gaaru..mee review chaalaa baagundi:):)

  2. ఆకాంక్ష said...

    Nice Navajeevan ji

Post a Comment