Posted by నవజీవన్

సామ్యవాదాన్ని విభిన్న కోణం లో పరిశీలించిన జార్జ్ ఆర్వెల్ ఆంగ్ల నవల "యానిమల్ ఫార్మ్"
 (ANIMAL FARM- Written by George Orwell)
ఒకానొక సందర్భం లో ప్రపంచమంతా పెట్టుబడిదారి వ్యవస్థ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక నవీన సిద్ధాంతం కోసం   మార్క్స్ "సామ్యవాదానికి" భరతం పట్టి స్టాలిన్, మావో వంటి నాయకుల ప్రేరణ తో ఒక సరికొత్త విప్లవం వైపు వెళ్తున్న సమయం లో కూడా, రష్యా లో స్టాలిన్ మార్గాలు ప్రపంచ రచయితలలో కొంత మందికి ఆశ్చర్యం తో ఒక సరికొత్త ఆలోచన దృక్పథాన్ని కూడా కలిగించాయి. హిట్లర్ తో సంధి, ట్రాట్ స్కీ  తో చిన్నిపాటి విభేదాలు స్టాలిన్ మార్గం సరైనది కాదేమో అన్న భావన తో 1945 లో బ్రిటన్ కు చెందిన ఆర్వెల్ రాసిన వ్యంగ్యాత్మక నవల "యానిమల్ ఫార్మ్"

ఈ నవలలో ఉన్న పాత్రలు అన్ని కూడా జంతువులే. మానవులు తమ మీద చెలాయిస్తున్న ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక కొన్ని జంతువులు చేసే తిరుగుబాటు తో నవల మొదలవుతుంది. జోన్స్ అనే ఒక ధనిక రైతు యొక్క కొన్ని ఎకరాల పంట భూమిని ఆక్రమించుకుని జంతువులు విప్లవాన్ని ప్రకటించి ఆ రైతు ను ఆ ప్రాంతం నుంచి వెల్ల గొట్టి ఒక సరికొత్త రాజ్యాన్ని ఏర్పరచుకొని తిరుగుబాటు ధోరణి తో జీవిస్తుంటాయి. ఈ జంతువులు అన్నింటికీ రాజు గా "నెపోలియన్" అనే వరాహం ఎన్నుకోబడుతుంది. నెపోలియన్ కు కుడి భుజంగా స్క్వీలర్ అనే మరో వరాహం బాద్యతలు స్వీకరిస్తుంది. "జాతీయ గీతం" రచించడానికి "మినిమాస్" అని వరాహం ముందుకు వస్తుంది.ఇలా ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుని జంతువులు కొన్ని నిబంధనలు పెట్టుకుని పాలనను ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. ఈ జంతువులలో "స్నోబాల్" అనే వరాహం సృజనాత్మకంగా, పరిశీలనాత్మకంగా ఆలోచిస్తుంది. బాగా చదవగల నేర్పు కూడా స్నోబాల్ కు ఉంటుంది. 

ఇక బాక్సర్ అనే గుర్రం కష్టపడే తత్వానికి, మోసెస్ అని గ్రద్ద గుఢాచర్యం నిర్వహించుటకు,మురియాల్ అనే మేక స్నేహతత్వానికి, మోళీ అనే మేక చంచల మనస్తత్వానికి, బెంజిమన్ అనే గాడిద తెలివితేటలకు, క్లోవార్ అనే గుర్రం బాక్సర్ ను కనిపెట్టుకుని ఉండే సహృదయశీలి గా భిన్న పాత్రలు పోషిస్తుంటాయి. మిగతా జంతువులలో పిల్లులు, కుక్కలు, ఆవులు, కోళ్ళు సహాయక జీవులు గా వ్యవహరిస్తుంటాయి.


జంతువులు స్వేచ్ఛాసౌఖ్యం పొందుతూ బతకడానికి ‘ఏడు నిబంధనలు’ తయారుచేసుకుంటాయి. అవి:
  1. రెండు కాళ్లతో నడిచే ప్రతిదీ మన శత్రువే.
  2. నాలుగు కాళ్లతో నడిచేది లేదా రెక్కలున్నది ప్రతిదీ మన మిత్రువే.
  3. జంతువులు బట్టలు కట్టాకూడదు.
  4. జంతువులేవీ మంచాలపై పడుకోకూడదు.
  5. జంతువులేవీ మద్యపానం సేవించరాదు.
  6. ఒక జంతువు మరో జంతువును వధించకూడదు.
  7. జంతువులన్నీ సమానమే.
ఒక రోజు జంతువులకు ఒక విభిన్న ఆలోచన వస్తుంది. మానవుల కన్నా మెరుగ్గా జీవించాలని భావిస్తాయి. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి "గాలి యంత్రం" నిర్మాణ బాధ్యతలను నెత్తి మీద వేసుకొని ఆ యంత్ర నిర్మాణం కొరకు శాయశక్తులా పని చేస్తాయి. ఇది వారి జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసే పని కావున మరింత శ్రద్ద తో పని చేయడం ప్రారంభిస్తాయి. ఆఖరి కి గాలి యంత్రం తయారవుతుంది. కాని వెంటనే కూలిపోతుంది.జంతువులు అన్ని నివ్వేరపోతాయి. రాజు నెపోలియన్ కు ఏమి చేయాలో అర్థం కాదు. ఈ విషయం లో స్నోబాల్ కు  నెపోలియన్ కు అభిప్రాయ భేదాలు వస్తాయి. నెపోలియన్ స్నోబాల్ ను రాజ ద్రోహం నేరం క్రింద దేశ బహిష్కరణ గావిస్తాడు.
జంతువులు ఏమి మాట్లాడలేక పోతాయి. ఆ రోజు నుంచి నెపోలియన్ విశ్వరూపం బయటపడుతుంది. తాము ఏర్పరచుకున్న నిబంధనలు తమకే పనికిరాకుండా పోవడం తో జంతువులు సందిద్గం లో పడతాయి.

నెపోలియన్ దేశాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అంటాడు. దాని కోసం అందరం కష్టించే పని చేద్దాం అంటాడు.కాని అతనే ఇతర వరహాలతో కలిసి రాత్రి పూట తాగుతూ, తూలుతూ రాజ భోగాలు అనుభవిస్తాడు.ఒకానొక సందర్భం లో మానవులు ఈ జంతు రాజ్యం పై దాడి చేయడానికి యత్నిస్తారు. కానీ ఆ సమయం లో జంతువులు అన్ని కాస్తా జాగారూపులై ఉండటం వలన ఆ దాడి ని తిప్పికొట్టగలుగుతాయి.జంతువులకు రాజ్యం లో ఏమి జరుగుతుందో అర్థం కాదు. అన్ని  విచార వదనాలతో ఉంటాయి.

తన సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఆలోచించే జంతువులకు నెపోలియన్ శిక్షలు కూడా వేస్తుంటాడు. ఒక్కపుడు స్నేహశీలి గా ఉన్న నెపోలియన్ ఇప్పుడు ఇలా ఎందుకు తయారయ్యాడో జంతువులకు అర్థం కాదు. ఒకానొక సమయం లో ముసలి గుర్రం బాక్సర్ కు ఆరోగ్య సమస్య వస్తుంది. అందరు పట్నం లో ఉన్న పెద్ద ఆసుపత్రి కి తీసుకెళ్ళమని నాయకుణ్ణి వేడుకుంటారు. కాని నెపోలియన్ డబ్బు కు కక్కుర్తి పడి అవసాన దశ లో ఉన్న బాక్సర్ ను జంతువధ్యశాల కు పంపిస్తాడు. జంతువులు ఈ ఘోరాలు చూడలేకపోతుంటాయి.

మానవుల వద్ద న్యాయవాది గా ఉంటున్న వింపర్ తో సత్సంబందాలు కొనసాగించడానికి నెపోలియన్ ఒక దశ లో ఒప్పుకుంటాడు . వింపర్ మానవులకు, జంతువులకు మధ్య వారధిగా ఉండి  చట్ట పరమైన సమస్యలు రాకుండా వ్యవహరిస్తుంటాడు. ఈ సమయం జంతువుల వద్ద అపజయం పొంది తాగుడు కు బానిస అయిన జోన్స్ కు, ఫ్రెడరిక్, పిల్కింగ్టన్ అనే ఇద్దరు మానవులు జత కలుస్తారు. 

ఇక్కడ నెపోలియన్ క్రమంగా ఏడు నిబంధనల స్ఫూర్తికి తూట్లు పొడుస్తుంది. తన వాదనను జంతువుల  వద్ద  వినిపించడానికి స్క్వీలర్ ని నియమిస్తుంది.స్క్వీలర్  తన  వాదన పటిమతో నెపోలియన్ ఆలోచనలన్నింటిని ఇతర జంతువులన్నింటి చేత అంగీకరింపజేస్తుంది. ఒకవేళ అప్పటికీ ఎవరైనా వినకపోతే వారిని లొంగదీసుకోవడానికి ఎనిమిది బలిష్టమైన కుక్కలతో ఒక ప్రత్యేక ఆర్మీ నే నడుపుతుంది.ధనికులు అయిన మానవులతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంది.

స్క్వీలర్ తనను  శరణుజొచ్చిన వారికి ప్రత్యేక పదవులు ఇస్తుంది. ఎదిరించిన వారికి మరణ శాసనం ఖాయం చేస్తుంది. ఏడు నిబంధనలు మారి మారి క్రమంగా మాయమై ఒకే నిబంధన మిగులుతుంది. ఆ నిబంధన వాక్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది: “అన్ని జంతువులూ సమానమే. కాని కొన్ని జంతువులు మాత్రం కొంచెం ఎక్కువ సమానం”. ఆ దశకల్లా మిష్టర్ జోన్స్ హయాంకంటే హీనమైన గడ్డురోజులు జంతువులు కు వస్తాయి . కొన్ని జంతువులు నెపోలియన్ కుట్రను పసిగడతాయి. కాని నిస్సహాయిత తో ఏమి అనలేని స్టితి కి చేరుకుంటాయి.

ఒకానొక రోజు నెపోలియన్ సంప్రదింపుల కొరకు మానవుల్ని జంతు రాజ్యం లోకి ఆహ్వానిస్తుంది. కొన్ని జంతువులు  అద్దాల మేడ లోనుంచి ఆ సమవేశాన్ని ప్రత్యక్షంగా చూస్తాయి. వారికి సమావేశం లో ఉన్న జీవులు అన్ని విభిన్నంగా కనిపిస్తాయి. ఏవి జంతువులో, ఏవి మనుషులో పోల్చుకోలేపోతాయి.

విప్లవం పేరిట సోవియట్ రష్యాలో అనేక మార్పులు జరిగాయి. మన రాజుల పాలనను పోలివుండే జార్ పాలనను అంతమొందించి సమసమాజం ఏర్పరచడంలో నాలుగైదు తరాలు తమ సమకాలీన ప్రపంచంతో తీవ్రంగా విప్లవాత్మకమైన పోరాటం చేయవలసి వచ్చింది. ఎన్నో ఆటుపోట్లు. అన్నింటికీ ఎదురునిలిచి కష్టసాధ్యమైన ఆశయాన్ని సుసాధ్యం చేసుకున్నారు. అయితే నాయకత్వాన్ని నిలబెట్టుకునే క్రమంలో అణచివేతలు తప్పలేదు. హత్యలూ తప్పలేదు.

ఇలా సోవియట్ రష్యాలో జరిగిన తతంగాన్ని ఈ  నవలలో జార్జి ఆర్వెల్ ఎంతో వ్యంగ్యభరితంగా చిత్రించారు. స్టాలిన్ ను వ్యంగ్యంగా చిత్రించినందుకో, కమ్యూనిజం భావాలమీద రాళ్లు విసిరినందుకో, అపురూప వ్యంగ్య వైభవాన్ని తన రచనలో చిత్రించినందుకో, ఇందుకే అని చెప్పలేం గానీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన నవలగా ఈ “ఏనిమల్ ఫామ్” ఖ్యాతి పొందింది.

సోవియట్ రష్యా చరిత్రలో పరిచయమున్నవారికి మేజర్ పంది లెనిన్ ను, స్నోబాల్ ట్రాట్ స్కీని, నెపోలియన్ స్టాలిన్ ను గుర్తు తెప్పిస్తాయి . జార్ చక్రవర్తుల కుటిల మనస్తత్వాల ఇరుకు సందుల్లో  బందీలై అష్టకష్టాలు పడుతున్న రష్యా ప్రజానీకం గుర్తుకొస్తుంది  –అయితే నవల జాగ్రత్తగా చదివిన పాఠకులు మాత్రం రచయిత కమ్యూనిస్టుల విప్లవ పోరాటాన్ని హేళన చేస్తున్నాడని ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటు పడరు. కేవలం ఆదర్శాల  కార్యాచరణను ఎద్దేవా చేయడం గమనిస్తారు. రచన అభిమతం  అదే కదా! నాయకత్వం ఏది చెబితే అది నమ్మి సామాన్య కార్యకర్తలైన జంతువులన్నీ నెపోలియన్ తమను ఎలా క్రమక్రమంగా బానిస దాస్య శృంఖలాలలో బంధిస్తున్నదీ తెలుసుకోలేక పోవడం నిజ జీవితంలో మనం చూస్తున్నదే.

కథంతా ఒకే వ్యవసాయ క్షేత్రం  లో నడపడం కూడా జీవితం అనే సూక్ష్మ ప్రపంచాన్ని అర్థవంతంగా చూపించడానికే .ఈ నవల లో ప్రతీ పాత్రది ఒక సంఘర్షణ.కాని అదంతా దోపిడీదారుడికీ దోపిడీకి గురయ్యేవాడికీ మధ్య జరిగే నిరంతర సంఘర్షణ. ఇంకా చెప్పాలంటే సోషలిస్టు సిద్దాంతాల లోనే మారుతున్నా భావజాలం మధ్య జరుగుతున్నా విభిన్న సంఘర్షణ. ఈ  వ్యంగ్య రచన దృక్పథం  ఏదో సిద్ధాంతాన్నో గేలి  చేయడం కాదు. కేవలం పరిస్థితులు మారాలన్న ఆలోచన మాత్రమె

(ఈ వ్యాసం  లో కొంత భాగం వికీపీడియా నుంచి తీసుకోవడం జరిగింది)






0 comments:

Post a Comment